contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం.. కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్

జగిత్యాల జిల్లా, కోరుట్ల: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణిని తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్ 31న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా డాక్టర్ వి. సునీతారాణి సంబంధిత సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఆసుపత్రి పరిపాలన, సిబ్బంది పర్యవేక్షణ, రోగులకు నిరంతర వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, విధులకు హాజరుకాకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.

తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు సగం మందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు నిరంతరాయంగా అందించేందుకు తగినంత మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు విధుల్లో ఉండటం అత్యంత అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గుర్తించిన లోపాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ వి. సునీతారాణిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టే వరకు ఆమెను సస్పెన్షన్‌లో ఉంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సస్పెన్షన్ కాలంలో జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా తన ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్యసేవల నాణ్యతను కాపాడేందుకు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :