పల్నాడు జిల్లా – మాచర్ల : ఎన్ని కుట్రలు, ఒత్తిళ్లు ఎదురైనా ఎన్నికల పోరులో వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ అభ్యర్థులు, నాయకులతో కలిసి ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయంపై నమ్మకం లేకే నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పిన్నెల్లి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరైనవి కావని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. తమ పార్టీ చైర్మన్, అభ్యర్థులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారని అభినందించారు.
నామినేషన్ల సమయంలో తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను అడ్డుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ప్రజల తీర్పుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి తన వాదనను వినిపిస్తుందని స్పష్టం చేశారు.
అధికార పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.








