contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జియ్యమ్మవలసలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దత్తి కామేశ్వరి జోరుగా ఎన్నికల ప్రచారం

జియ్యమ్మవలస : జియ్యమ్మవలస మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ కూటమి తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న దత్తి కామేశ్వరి శుక్రవారం తుంబలి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి బొంగు కన్నమ్మతో కలిసి తుంబలి ఎంపీటీసీ పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బ్యాండ్ మేళాల సందడి, పసుపు జెండాల రెపరెపలు, కార్యకర్తల నినాదాలతో గ్రామాలు ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు దత్తి కామేశ్వరికి ఘన స్వాగతం పలుకగా, ప్రచార యాత్ర జనసంద్రంగా మారింది.

ప్రచారంలో భాగంగా దత్తి కామేశ్వరి, బొంగు కన్నమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా దత్తి కామేశ్వరి మాట్లాడుతూ, గతంలో రెండుసార్లు ఎంపీపీగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. ఈసారి జెడ్పీటీసీ అభ్యర్థిగా మరోసారి ప్రజల ముందుకు వచ్చానని, అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

“చెప్పాం… చేస్తున్నాం… చేస్తాం” అనే నినాదంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్న ఆమె, ప్రజల విశ్వాసానికి తగిన విధంగా మరింత సేవ చేస్తామని హామీ ఇచ్చారు.

దత్తి కామేశ్వరి భర్త, టీడీపీ సీనియర్ నాయకుడు దత్తి లక్ష్మణరావు కూడా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఈ ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీ అభ్యర్థులను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, యువత, పార్టీ శ్రేణులు మరియు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దత్తి కామేశ్వరి, బొంగు కన్నమ్మలకు తమ మద్దతు ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :