contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడలో ముంపు నివారణ అసాధ్యమా..? నిర్లక్ష్యమా..?

కాకినాడ నగరంలో ముంపు నివారణ చర్యలు, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన నగరంలో కొనసాగుతున్న పారిశుధ్య సమస్యలు, ముంపు పరిస్థితులు, పరిపాలనా వైఫల్యాలపై పలు ఆరోపణలు చేశారు.

రెండేళ్లుగా ప్రధాన కాలువల్లో పూడిక తొలగింపు పనులు సక్రమంగా చేపట్టలేదని, దీంతో వర్షాకాలంలో మురుగునీటి పారుదల వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన అన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారినా సంబంధిత అధికారులపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

నగర అభివృద్ధి పేరుతో చేపట్టిన పనుల్లో సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమణరాజు ఆరోపించారు. రోడ్లను ఎత్తు చేయడం, లోతు-వెడల్పు కలిగిన డ్రైనేజీల పునర్నిర్మాణం చేపట్టకపోవడం, నాణ్యతలేని కల్వర్టుల నిర్మాణం వంటి కారణాలతో వర్షపు నీరు సకాలంలో బయటకు వెళ్లక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.

స్మార్ట్ సిటీ పనుల పేరుతో భారీగా ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని, ఆ పనులపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులపై విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తు జరిపి అక్రమాలు వెలికితీయాలని కూడా కోరారు.

రేచర్లపేట రైల్వే మేజర్ డ్రెయిన్, పీడబ్ల్యూడీ కాలువలు, ఆర్ అండ్ బీ క్రాస్ కల్వర్టులు, రైల్వే అవుట్‌లెట్ మార్గాల పునరుద్ధరణ పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆరోపించారు. చెత్త నిర్వహణలో లోపాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నగరంలో ముంపు పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని చెప్పారు.

పారిశుధ్య సిబ్బంది కొరత, దోమల నివారణ చర్యలు తగ్గిపోవడం, కాలువల శుభ్రపరిచే పనులు నిలిచిపోవడం వంటి అంశాలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తుఫానులు, భారీ వర్షాల సమయంలో ముంపు నీటిని బయటకు పంపేందుకు అవసరమైన భారీ మోటార్ పంపులు, ముందస్తు కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కార్పొరేషన్‌లో పూర్తి స్థాయి అధికారుల నియామకాలు లేక పలువురు అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పరిపాలన దెబ్బతింటోందని రమణరాజు అభిప్రాయపడ్డారు. నగరపాలక సంస్థలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అధికారులను బదిలీ చేసి, సమర్థుడైన సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ముందుగా కార్పొరేషన్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి, ముంపు నివారణ చర్యలు, పారిశుధ్య మెరుగుదల, ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్‌కు లేఖ రాసినట్లు రమణరాజు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :