పల్నాడు జిల్లా, మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పట్టణంలోని కిడ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అధికారులు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
ముందుగా అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్స్‌ను అధికారులు తొలగించారు. అనంతరం భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించి, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు తదితర సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలోని వినుకొండ, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థుల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ నెలకొంది. అధికారులు ఫలితాల ప్రకటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.








