- ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత వ్యవహారంపై అధికారుల దర్యాప్తు.. రికవరీ చేయాలని గ్రామస్తుల డిమాండ్
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఖాసీంపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జక్కనపల్లి శ్రీలత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై శుక్రవారం జిల్లా స్థాయి అధికారులు గ్రామంలో మరోసారి విచారణ చేపట్టడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.
ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలతపై వచ్చిన ఆరోపణలపై గతంలో నిర్వహించిన విచారణలో కొన్ని అంశాలు నిర్ధారణ కావడంతో కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) ఆమెను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఆమెపై ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్‌లో ఉన్న భర్త పేరుతో కూలీ పనులు చూపించడం, సొంత పనులకు ఉపాధి కూలీలను వినియోగించడం, నకిలీ జాబ్ కార్డుల వ్యవహారం, 100 రోజుల పనిదినాలు పూర్తికాకముందే ఇతర జాబ్ కార్డుల పేర్లతో పనులు నమోదు చేయడం వంటి ఆరోపణలు గతంలో ఫిర్యాదుల రూపంలో వచ్చాయి.
ఖాసీంపేటలో ఏపీడీ విచారణ
సస్పెన్షన్‌కు సంబంధించిన అంశాలపై జిల్లా స్థాయి అధికారి ఏపీడీ పి. కృష్ణ శుక్రవారం ఖాసీంపేట గ్రామపంచాయతీలో విచారణ నిర్వహించారు. ఈ విచారణలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కర్నే చంద్రయ్య, ఉప సర్పంచ్ సందవేణి ఐలయ్య, ఫిర్యాదుదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
విచారణ సందర్భంగా ఫిర్యాదుదారులు తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలను అధికారుల ముందు ఉంచినట్లు తెలిసింది. అలాగే గ్రామ ప్రజలు కూడా ఉపాధి హామీ పనుల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై అధికారులకు వివరించినట్లు సమాచారం.
“సస్పెన్షన్‌తో సరిపెట్టొద్దు.. నిధులు రికవరీ చేయాలి”
ఫీల్డ్ అసిస్టెంట్‌పై కేవలం సస్పెన్షన్ చర్యలతోనే సరిపెట్టకుండా, దుర్వినియోగం జరిగిన నిధులను పూర్తిగా రికవరీ చేయాలని ఫిర్యాదుదారులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రస్తుతం నిర్వహించిన విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఖాసీంపేట గ్రామంలో ఆసక్తి నెలకొంది. అధికారులు తీసుకునే తదుపరి చర్యల కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.








