జగిత్యాల జిల్లా, మెట్పల్లి: స్నేహితుడి ఇంట్లోనే బంగారు ఆభరణాలను చోరీ చేసి, వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసిన యువకుడిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 8 తులాల బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య అలియాస్ ప్రేమలత ఇంట్లో గత అక్టోబర్ 14న బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బీరువాలోని లాకర్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితురాలు మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా బాధితురాలి కుమారుడు అభినవ్ స్నేహితుడైన చైతన్యనగర్‌కు చెందిన ఇందూరి నవీన్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న నవీన్‌కు వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్లే క్రమంలో బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్న విషయం, బీరువాకు సరైన తాళం లేకపోవడాన్ని గమనించి అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన బంగారు గొలుసు, నెక్లెస్, కమ్మలు, బుట్టలు, ఉంగరం, మాటీలను మెట్‌పల్లిలోని మణప్పురం గోల్డ్ లోన్స్‌లో మూడు విడతలుగా తాకట్టు పెట్టి నగదు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఆ డబ్బులతో అప్పులు తీర్చడంతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి బంగారం తాకట్టు పెట్టేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్, తాకట్టు రసీదులు, స్టేట్మెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచుల సమక్షంలో స్వాధీన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం నిందితుడిని మెట్పల్లి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్ఐ పి. కిరణ్ కుమార్ తెలిపారు.
స్నేహితుడి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తును స్థానికులు అభినందించారు.








