గోదావరిఖని : పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ లక్ష్యమని ఆయన సతీమణి, మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాగూర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో 1200 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన నేపథ్యంలో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో తొలి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
38వ డివిజన్ కార్పొరేటర్ నెలికంటి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనాలి ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు లింగయ్య, స్వరూప దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఆమె భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మనాలి ఠాగూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలో అర్హులైన అనేక మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
పేద కుటుంబాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయించి అర్హులైన పేదలకు అందజేసినట్లు మనాలి ఠాగూర్ వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులను సహించబోమని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నెరవేర్చుతారని ఆమె తెలిపారు.
అనంతరం 38వ డివిజన్ కార్పొరేటర్ నెలికంటి రాము మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ఇప్పటికే 22 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. డివిజన్లో మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట రాజు, డివిజన్ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ కవ్వంపల్లి కనకలక్ష్మి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత, నేరెళ్ల రాజ్ కుమార్, కుమార్, వినోద్, కిషోర్, రాజ్ కుమార్, ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.








