విజయవాడ: విజయవాడలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు, త్వరలో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల విజయానికి దేవాదాయ, పర్యాటక శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, పర్యాటక కార్యక్రమాలపై సమీక్షించారు.
సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదు
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలు సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. దసరా ఉత్సవాలు సామాన్యుల పండుగగా ఉండాలి తప్ప, కేవలం వీఐపీలకు పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనల కారణంగా సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వీఐపీల రాకపోకల సమయంలో విధించే ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, రవాణా ఏర్పాట్ల ద్వారా ఇబ్బందులను తగ్గించాలని ఆదేశించారు.
అక్టోబర్ 13 నుంచి జాతీయ సరస్ మేళా
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా-2026ను విజయవంతంగా నిర్వహించాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుర్గమ్మ దర్శనం, మేళాకు హాజరుకానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా సమీక్షించారు.
దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించేందుకు ఈ మేళాలో మొత్తం 576 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటిలో 208 స్టాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా తెలిపారు.
రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను ‘స్వయం ఏపీ’ బ్రాండ్ కింద జాతీయ స్థాయిలో పరిచయం చేసేందుకు సరస్ మేళా మంచి వేదికగా నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు తమ ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆదాయం పెరిగేలా అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
ఘనంగా విజయవాడ ఉత్సవ్ 2.0
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0ను కూడా ప్రజల భాగస్వామ్యంతో వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
దసరా ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ వంటి వరుస కార్యక్రమాలతో విజయవాడకు భక్తులు, పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా భద్రత, పారిశుధ్యం, రవాణా, తాగునీరు తదితర సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









