గోదావరిఖని : నేరప్రవృత్తిని పూర్తిగా విడనాడి చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని, లేనిపక్షంలో నగర బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ రౌడీషీటర్లను హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను బుధవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు.
హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, పౌర వివాదాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పదేపదే నేరాలకు పాల్పడుతూ తమ ప్రవర్తనను మార్చుకోని వ్యక్తులపై చట్ట ప్రకారం పీడీ యాక్ట్ అమలు చేయడంతో పాటు నగర బహిష్కరణకు కూడా సిఫారసు చేస్తామని తెలిపారు. నేరాలనే జీవన విధానంగా మార్చుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఇప్పటికైనా నేరప్రవృత్తిని విడనాడి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని హితవు పలికారు.
ప్రజలు ప్రశాంతంగా జీవించేలా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీపీ ఎం. రమేష్ స్పష్టం చేశారు.
ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.








