తూప్రాన్, మెదక్ జిల్లా : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పోతరాజ్‌పల్లిలో సోమవారం ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, నిర్దేశించిన చెత్త బుట్టల్లోనే వేయాలని అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తడి, పొడి చెత్తను వేరు చేసే అలవాటును పాటిస్తే పారిశుద్ధ్య నిర్వహణ మరింత సులభతరమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ బొడ్డు రాధాకుమారి శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.








