మెదక్, తూప్రాన్ : మార్షల్ ఆర్ట్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ 16 బంగారు పతకాలు సాధించడంతో పాటు గ్లోబల్ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్ లీ అవార్డును అందుకున్న నితన్య సిరిపై మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రశంసలు కురిపించారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నమ కృష్ణ కుమార్తె నితన్య సిరి సాధించిన విజయాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నితన్య సిరిని ఎస్పీ శాలువాతో సత్కరించి, సర్టిఫికెట్‌తో పాటు అవార్డును అందజేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆమె సాధించిన విజయాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఎనిమిదేళ్లుగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ
నితన్య సిరి ప్రస్తుతం ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్న ఆమె గత ఎనిమిదేళ్లుగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ పలు విజయాలను సాధించింది. బ్లాక్ బెల్ట్ డాన్-2 సాధించిన నితన్య సిరి, మలూరి నాగేశ్ మాస్టర్ మార్గదర్శకత్వంలో శిక్షణ కొనసాగిస్తోంది.
హోంగార్డు కుటుంబానికి చెందిన నితన్య సిరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మెదక్ జిల్లాకు గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని, తమలోని ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రంగనాథ్, ఆర్‌ఐ శైలేందర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








