గోదావరిఖని : సామాజిక సమానత్వానికి కులాంతర వివాహాలు బలమైన పునాదిగా నిలుస్తాయని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. కులవివక్షను నిర్మూలించి, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు.
బుధవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 45 మంది లబ్ధిదారులకు కులాంతర వివాహ ప్రోత్సాహక చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించిన ఆయన, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని కుటుంబాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.
కులాంతర వివాహాలు సామాజిక మార్పుకు నాంది పలుకుతాయని, సమానత్వం, సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్తఫ్, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.








