contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఓటు హక్కు రక్షణే ప్రజాస్వామ్యానికి పునాది: ఎమ్మెల్సీ దండే విఠల్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే పారదర్శకమైన దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణే లక్ష్యంగా ఆసిఫాబాద్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మరియు ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ మెయ్యప్పన్, కోఆర్డినేటర్ శ్రవణ్ రావ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దండే విఠల్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే ప్రజాస్వామ్య మూల సూత్రాలకే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాల్లో తలెత్తిన ఆరోపణలను నిష్పాక్షికంగా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :