contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహాత్మా.. కాకినాడ నగరానికి ఏమయ్యింది?

కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో 42, 48 డివిజన్లను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు గాంధేయ మార్గంలో వినూత్న నిరసన తెలిపారు. హైకోర్టులో ఈ డివిజన్లకు సంబంధించిన కేసులు డిస్మిస్ అయి రెండు వారాలు గడిచినా, వాటిని కలుపుకుని ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకపోవడం బాధ్యతారాహిత్యమని ఆయన ఆరోపించారు.

కాకినాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని, నోటికి మాస్క్ ధరించి, చెవుల్లో దూది పెట్టుకుని నిరసన తెలిపారు.

గాంధీజీ చెప్పిన “చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు” అనే సందేశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం కాకినాడ నగర విస్తరణ విషయంలో జరుగుతున్న పరిణామాలను చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని రమణరాజు విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధమైన విధానాలను పక్కన పెట్టి నగర విస్తరణను అన్యాయంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016లో కాకినాడ నగర పరిధిలోకి వచ్చిన 42, 48 డివిజన్ల నుంచి గత పదేళ్లుగా కార్పొరేషన్ పన్నులు వసూలు చేస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు కోటి రూపాయల చొప్పున ఆదాయం వచ్చినప్పటికీ, హైకోర్టు కేసులు ముగిసిన తర్వాత కూడా ఆ డివిజన్లను పరిగణనలోకి తీసుకోకుండా 66 డివిజన్ల విభజన, రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టడం సరైన విధానం కాదని అన్నారు.

42, 48 డివిజన్లు, ఆరు విలీన గ్రామాల భవిష్యత్‌పై స్పష్టత రాకముందే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం 112 గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వం, గతంలోనే విలీనమైన ఆరు గ్రామాలను కూడా నగర పరిధిలో చేర్చి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని రమణరాజు డిమాండ్ చేశారు. విలీన గ్రామాలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే నష్టపోయామని, భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

డివిజన్ల సరిహద్దుల విభజన, ఓటర్ల జాబితా తయారీ వంటి అంశాల్లో అధికారులు తగిన సమయం ఇవ్వకుండా హడావుడిగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల కేటాయింపులోనూ పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.

42, 48 డివిజన్లను కలిపి ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన కొత్త రిట్ పిటిషన్‌పై నవంబర్ 2న హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని రమణరాజు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 72 విలీన గ్రామాల అంశంపై కూడా స్పష్టత వచ్చిన తర్వాతే కాకినాడ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ఆయన కోరారు.

కోర్టు తీర్పులను గౌరవిస్తూ, ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రమణరాజు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :