గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లె గ్రామ పరిధిలోని కూనవానిపల్లెలో చోటుచేసుకున్న కుల బహిష్కరణ వివాదానికి గన్నేరువరం పోలీసులు సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపారు. పోలీసుల చొరవతో ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోవడంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే, కూనవానిపల్లెకు చెందిన కూన భారతి అనే మహిళ బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకుండా తనను పక్కకు తొలగించి అవమానించడంతో పాటు కులం నుంచి బహిష్కరించారని ఆరోపిస్తూ గన్నేరువరం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును పరిశీలించిన సీఐ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరు వర్గాలను పిలిపించి విస్తృతంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించేలా చర్చలు జరిపి రాజీ కుదిర్చారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ఇకపై ఎలాంటి కుల బహిష్కరణలు, వివక్షపూరిత చర్యలు చోటుచేసుకోకుండా అందరూ సామరస్యంతో, పరస్పర గౌరవంతో జీవించాలని సూచించారు. సామాజిక ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పోలీసుల సకాలంలో జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంతో గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ఐకమత్య వాతావరణం కొనసాగాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.








