కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల (అక్టోబర్ 21–31) ముగింపు సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కమిషనరేట్ ఆవరణలోని పోలీస్ అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది.
ర్యాలీలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, విజయ్‌కుమార్, వివిధ మతాల మత పెద్దలు, పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరులైన పోలీస్ వీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, దేశ ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీస్ సిబ్బంది వీరమరణం పొందగా, వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 47 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని గుర్తుచేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గత పది రోజులుగా పలు సేవా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. అమరవీరుల పరేడ్, జిల్లాలోని సుమారు 29 మంది అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరాలు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించడం ద్వారా అమరవీరుల సేవలను స్మరించుకున్నామని తెలిపారు.
పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పని చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. పోలీసులను వ్యతిరేక దృక్పథంతో కాకుండా భాగస్వాములుగా భావించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అలాగే చిన్నారులకు ఖాకీ యూనిఫాం గొప్పతనాన్ని, దేశసేవలో పోలీస్ వ్యవస్థ పాత్రను వివరించి, భవిష్యత్తులో యూనిఫాం సర్వీసుల్లో చేరేందుకు వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరిస్తూ, వారి ఆశయాలను కొనసాగించేలా ప్రజలు–పోలీసులు కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమం ముగిసింది. కార్యక్రమం ముగింపులో అమరవీరులకు మరోసారి మౌన నివాళి అర్పించి వారి త్యాగస్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.








