గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం దిశగా ఇంటర్లింక్ పైప్లైన్ పనులను ఆదివారం కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ప్రారంభించారు.
43వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అనేక కుటుంబాలు మంచినీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక బస్తీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ సమస్య తీవ్రతను మున్సిపల్ మేయర్ మహంకాళి స్వామి పర్యటన సందర్భంగా ఆయనకు వివరించారు.
దీనిపై స్పందించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది సహకారంతో యుద్ధప్రాతిపదికన ఇంటర్లింక్ పైప్లైన్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
మంచినీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మున్సిపల్ మేయర్ మహంకాళి స్వామి, సంబంధిత మున్సిపల్ అధికారులు, సిబ్బందికి 43వ డివిజన్ బస్తీవాసుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.








