కాకినాడ: స్వామి నగరం, ఎస్. అచ్యుతాపురం, గంగనాపల్లి పరిధి నుంచి వేరు చేసి నగర పాలక సంస్థలో 42, 48 డివిజన్లుగా విలీనం చేసిన గ్రామ ప్రాంతాలను ఇకపై త్రిశంకు స్వర్గంలో ఉంచకుండా వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆయా డివిజన్ల పౌర కమిటీలు డిమాండ్ చేశాయి.
ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కాకినాడ నగరంలోని సినిమా రోడ్డు వద్ద ఉన్న కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలతో కలిసి భారీ పౌర ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇ-మెయిల్, రిజిస్టర్ పోస్టుల ద్వారా వినతులు పంపిస్తూ డీఆర్ఓ తిప్పే స్వామికి వినతిపత్రం అందజేశారు.
స్థానిక ప్రజా సంఘాల నాయకుడు పెదపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయకుమార్, దుర్గా రమణ, తోకల చిన్న రవి తదితరులు మాట్లాడుతూ 42, 48 డివిజన్ల విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
గత పదేళ్లుగా జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్ సేవలు, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్లు, ఆస్తి పన్నులు, నీటి పన్నులు వంటి అన్ని ప్రభుత్వ రికార్డులు నగర పాలక సంస్థ పరిధిలోనే కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కోట్ల రూపాయల మేర మున్సిపల్ పన్నులు వసూలు చేస్తున్న కార్పొరేషన్, ఇప్పుడు 42, 48 డివిజన్లు తమ పరిధిలో లేనట్లుగా వ్యవహరించడం సరికాదని ఆరోపించారు.
42, 48 డివిజన్లను నగర పరిధిలో గుర్తించి ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే ఇన్నేళ్లుగా వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
2017లో 42, 48 డివిజన్ల అంశం కోర్టు వ్యాజ్యం కారణంగా నిలిచిపోయిందని, అనంతరం 2026 అక్టోబర్ 15న హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసినా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పౌర కమిటీలు పేర్కొన్నాయి.
నవంబర్ 2న రిజర్వ్ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో హడావుడిగా పాత 50 డివిజన్లను 66గా మార్చడం, సరిహద్దుల మార్పులు చేయడం, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం వంటి చర్యల్లో 42, 48 డివిజన్లను పక్కన పెట్టడం సరికాదని వారు అన్నారు.
ఈ ధర్నాకు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక కార్యకర్త దూసర్లపూడి రమణరాజు మద్దతు తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న విలీన గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున, తొందరపాటు లేకుండా చట్టబద్ధంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆయన కోరారు.
గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా విలీనమైన ఆరు గ్రామాలను నగర పాలక సంస్థలో చేర్చే ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రమణరాజు పేర్కొన్నారు.
42, 48 డివిజన్ల పౌర కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ధర్నా కార్యక్రమం అనంతరం అధికారులు వినతిపత్రాన్ని స్వీకరించారు.








