మెదక్: మెదక్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతమని తెలిపారు. జిల్లాలో సాగునీటి వనరులు పరిమితంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని 21 మండలాల్లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కేవలం మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడం అన్యాయమని సీపీఎం నాయకులు అన్నారు. ఈ నిర్ణయం జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. పంటలు నష్టపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరువు ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో ప్రజల జీవనోపాధికి అవసరమైన వనరులు తక్కువగా ఉన్నాయని, పరిశ్రమలు కూడా పెద్దగా లేవని తెలిపారు. దీంతో జిల్లాలోని పలు మండలాల నుంచి సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ప్రజలు నిత్యం కూలీ పనుల కోసం వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికైనా శాస్త్రీయంగా పునఃపరిశీలన చేసి మెదక్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కరువు పరిస్థితులపై నిర్లక్ష్యం వహించడం వల్ల జిల్లా ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించారు.
జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించి, కరువు మండలాల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. మెదక్ జిల్లాలోని 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు దుర్గ, షౌకత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.








