ఏక్తానగర్, గుజరాత్: దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో వివిధ భద్రతా బలగాల కవాతులు, మహిళా సైనికుల విన్యాసాలు, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ ఐక్యతను చాటేలా నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోండు కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి, గిరిజన కళా వైభవాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 5 వేల మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన అపార సేవలను స్మరించుకున్నారు. పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశం అభివృద్ధి, భద్రత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, నశా ముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, నోడల్ అధికారి ఆడెపు శ్రీనివాస్, ప్రొఫెసర్, ఎన్సీసీ అధికారి డాక్టర్ పి. రాజు తదితరులు హాజరయ్యారు.
జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు దేశ ప్రజల్లో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేసేలా ఘనంగా జరిగాయి.








