మెదక్: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించేందుకు మెదక్ పట్టణంలో శుక్రవారం ఫ్లాష్ వాక్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు జెండా ఊపి ప్రారంభించారు.
అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఫ్లాష్ వాక్ రామాలయం మీదుగా రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొని సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరింపులు వంటి వాటిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని ఎస్పీ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
సైబర్ నేరానికి గురైన వారు వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, రంగనాథ్, సీఐలు మహేష్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








