తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు పోత్తూరి లచ్చమ్మ (80)ను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నగల కోసం జరిగిన ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
స్థానికుల సమాచారం ప్రకారం, గత రాత్రి లచ్చమ్మ నివాసంలోకి చొరబడిన దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలను దోచుకున్నారు. అనంతరం ఎలాంటి ఆధారాలు మిగలకుండా ఉండేందుకు ఆమెపై అమానుషంగా దాడి చేసి, కాళ్లు, చేతులు విరగొట్టి అత్యంత పాశవికంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఉదయం ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా లచ్చమ్మ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆనవాళ్లను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. గ్రామ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. వృద్ధురాలి హత్యతో వచ్చునూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.








