అనంతపురం జిల్లా, యాడికి : యాడికి మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశారు. గతంలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిన మండలంలో ఈసారి ఎన్నికల ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకోగా, మిగిలిన 12 స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ సైకిల్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కోనుప్పలపాడు నుంచి రవికుమార్ రెడ్డి, చందన నుంచి అనిత, కమలపాడు నుంచి వాణి, పుప్పాల నుంచి శ్రీరాములు ఉన్నారు.
విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు వీరే..
- నగరూరు: ఆదినారాయణ (1,138 ఓట్లు)
- నిట్టూరు: రాజేశ్వరరెడ్డి (1,112 ఓట్లు)
- రాయలచెరువు-1: పరిమి చరణ్ (1,114 ఓట్లు)
- రాయలచెరువు-2: నాగరాజుగౌడ్ (668 ఓట్లు)
- వేములపాడు: రమాదేవి (1,069 ఓట్లు)
- యాడికి-1: నారాయణస్వామి (721 ఓట్లు)
- యాడికి-2: పద్మావతి (781 ఓట్లు)
- యాడికి-3: శీలామౌనిక (1,077 ఓట్లు)
- యాడికి-4: భారతి (511 ఓట్లు)
- యాడికి-5: ఆదిలక్ష్మి (780 ఓట్లు)
- యాడికి-6: మధురాజు (646 ఓట్లు)
- యాడికి-7: ఓబుళమ్మ (457 ఓట్లు)
రాజకీయంగా ఆసక్తికరంగా మారిన ఫలితాలు
యాడికి మండల రాజకీయాల్లో ఈ పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రస్తుతం అదే 16 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
నాడు వైసీపీకి కంచుకోటగా ఉన్న యాడికి మండలంలో నేడు టీడీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.








