contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సిర్పూర్ పేపర్ మిల్స్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్స్ (ఎస్‌పీఎం) పునఃప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయినా కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం బాధాకరమని ఎస్పీఎం కార్మిక సంక్షేమ వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాజమాన్యానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన పది మంది సభ్యుల వర్క్స్ కమిటీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ సీక్రెట్ బ్యాలెట్ విధానంలో గుర్తింపు సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

కార్మికులకు ఐటీసీ భద్రాచలం పేపర్ మిల్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, డీఏలు అమలు చేయాలని, కొత్త వేతన ఒప్పందం జరిగే వరకు ప్రతి నెల రూ.10 వేల మధ్యంతర భృతిని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రొడక్షన్ బోనస్‌ను 10 శాతానికి పెంచి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మూసివేసిన కార్మిక క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

మిల్లులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సెలవులను 30 రోజులకు పెంచాలని కూడా కోరారు.

ఈ డిమాండ్లకు మద్దతుగా 223 మంది కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సంయుక్త కార్మిక కమిషనర్, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అందజేసినట్లు నాయకులు వెల్లడించారు. హైకోర్టు తీర్పు వెలువడిన నెల రోజుల్లోగా గుర్తింపు సంఘం ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

కార్మికులు తమ సమస్యలను ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని యాజమాన్యంపై వారు ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ వ్యవహరిస్తే ఊరుకోబోమని, యాజమాన్యం, సంబంధిత అధికారులు స్పందించని పక్షంలో కార్మిక జేఏసీతో పాటు ఇతర ప్రజాసంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఎస్పీఎం కార్మిక సంక్షేమ వేదిక గౌరవ అధ్యక్షులు భట్టాచార్య హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శులు సతీష్, గణపతి, శుభాష్, రాజమల్లు, నల్ల శ్రీనివాస్, నానాజీ, వెంకటేష్, జిలకర పోచం తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :