contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డీలిమిటేషన్‌ బిల్లుకు కేబినెట్ ఆమోదం – రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భరోసా

న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మంత్రివర్గం, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గకుండా రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులకు ఆమోదం తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో జరిగిన అత్యవసర కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 50 శాతం వరకు పెంచి, ఆ నిష్పత్తిని 2051 వరకు కొనసాగించేలా రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.

లోక్‌సభ సీట్లు 543 నుంచి 850కు

ప్రతిపాదిత సవరణ ప్రకారం, 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగిస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. దీంతో ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ సభ్యుల సంఖ్య గరిష్ఠంగా 850కు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు అమలైతే 2029 సాధారణ ఎన్నికలకు ముందే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమమవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

విపక్ష మద్దతుపై దృష్టి

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం 543 సభ్యులున్న లోక్‌సభలో కనీసం 361 మంది సభ్యుల మద్దతు అవసరం. గతంలో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల మద్దతు పొందేందుకు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించబోమనే భరోసాతో కేంద్రం తాజా సవరణలను తీసుకువచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రత్యేకంగా 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఎంపీలున్న ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వంటి పార్టీల మద్దతు ఈ బిల్లుకు కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు

ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కోరినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. డిసెంబర్ 3తో ఈ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నట్లు ఆయన తెలిపారు.

సభ్యులందరూ నిర్మాణాత్మకంగా పాల్గొనాలి: రిజిజు

రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నందున సభ్యులందరూ సభా కార్యకలాపాల్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పిలుపునిచ్చారు. బిల్లుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, పార్లమెంట్ సమావేశాలను గౌరవప్రదంగా నిర్వహించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే వ్యాఖ్యలు, నిరసనలు నివారించాలని ఇప్పటికే సభ్యులను కోరినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజా ప్రయోజనాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :