మెదక్ – తూప్రాన్ : పేదలు, రైతులు, నిరుద్యోగ యువతతో పాటు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావాలని, అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు ఉదారంగా రుణాలు అందించాలని మెదక్ జిల్లా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు.
మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా బ్యాంకులు చొరవ చూపాలని ఆయన కోరారు.
వ్యవసాయ రంగానికి అవసరమైన రుణాల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక సాధికారతకు తోడ్పడాలని ఎంపీ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. అలాగే లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధి హేమలత, నాబార్డ్ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు హాజరై బ్యాంకింగ్ సేవలు, రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.








