పార్వతీపురం మన్యం జిల్లా – జియ్యమ్మవలస : గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘పల్లె పండుగ 2025-26’ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెలు నిరుపయోగంగా మారుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జియ్యమ్మవలస మండలం అప్పన్నదొరవలస గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పశువుల నీటి తొట్టెను నిర్మించారు. ఈ నిర్మాణానికి ప్రభుత్వం రూ.40,395 ఖర్చు చేసినట్లు అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై పేర్కొన్నారు. అయితే నిర్మాణం పూర్తయినప్పటికీ, తొట్టెలో నీటిని నింపకపోవడంతో అది ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తోంది.
ఎండ తీవ్రతకు పశువులు, గొర్రెలు, మేకలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం వచ్చే మూగజీవాలకు ఉపయోగపడాల్సిన తొట్టెల్లో నీరు లేకపోవడంతో అవి నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ప్రజాధనంతో నిర్మించిన సౌకర్యాలు వినియోగంలోకి రాకపోవడంపై గ్రామస్థులు, గొర్రెల కాపరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేయడంతోనే అధికారులు బాధ్యత ముగిసినట్లు భావించకూడదని, వాటి నిర్వహణపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశువుల నీటి తొట్టెల్లో నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు ప్రజలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగపడేలా పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.








