మాచర్ల : మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుకూరి మధు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కందుకూరి మధు మాట్లాడుతూ, భారతదేశంలో సామాజిక సమానత్వం, మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన పూలే, కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు.
1848లో తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య, సమాన హక్కులు అందాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
సత్యశోధక్ సమాజ్ను స్థాపించి కులవివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం మహాత్మా పూలే చేసిన ఉద్యమం దేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఆయన రచించిన ‘గులాంగిరి’ గ్రంథం సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ సామాజిక చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు.
1890 నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావు పూలే పరమపదించినప్పటికీ, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోందని కందుకూరి మధు పేర్కొన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి, కులమతాలకు అతీతంగా విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల మరియదాస్, మంద సాగర్, మహంకాళి పిచ్చయ్య, ఎద్దుల ప్రసాద్, అరుమూళ్ల జానూ, కోట రాజేష్, యాలపాటి రమేష్, కొమ్ము వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించారు.








