మధురై (తమిళనాడు) : ఎన్నో రోజులుగా వివాదానికి కేంద్రబిందువుగా మారిన తమిళనాడు మధురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న పురాతన రాతి దీపస్తంభంపై ఎట్టకేలకు మహాదీపం వెలిగింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అర్చకులు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ సమక్షంలో సాయంత్రం ఐదు గంటలకు దీపాన్ని ప్రజ్వలింపజేశారు.
దీపోత్సవం కోసం 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల పొడవైన వత్తి, 5 కిలోల కర్పూరాన్ని వినియోగించారు. దీపం వెలిగిన క్షణంలో కొండప్రాంతమంతా “మురుగన్” నినాదాలతో మారుమోగగా, భక్తులు భక్తిశ్రద్ధలతో జైజైకారాలు చేశారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్‌ను భారీగా మోహరించారు. కొండ పరిసరాలను భద్రతా వలయంలోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండపైకి కేవలం 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వగా, సిక్కందర్ దర్గా పరిసరాల్లో 50 మీటర్ల బఫర్ జోన్‌ను ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు కొండ దిగువ ప్రాంతంలోనే నిలబడి ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీపోత్సవం
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపోత్సవ నిర్వహణ బాధ్యతలను పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ పర్యవేక్షించారు. వారి సమక్షంలో సంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగించగా, భక్తులు బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
వివాదానికి కేంద్రంగా మారిన దీపస్తంభం
తిరుప్పరంకుండ్రం కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సమీపంలోని ఉచ్చిపిళ్లైయార్ ఆలయ దీప మండపంలో ఏళ్లుగా కార్తీక మహాదీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, అదే కొండపై సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతి దీపస్తంభంపై కూడా దీపం వెలిగించాలని పలువురు హిందూ సంఘాలు కోరుతూ రావడంతో ఈ అంశం వివాదాస్పదమైంది.
గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రాతి దీపస్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ అవి అమలుకాలేదు. అనంతరం విషయం సుప్రీంకోర్టుకు చేరగా, ఈ ఏడాది నవంబర్ 20న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం రాతి దీపస్తంభంపైనే మహాదీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అయితే కార్తీక పౌర్ణమి రోజున సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉచ్చిపిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే దీపం వెలిగించడంతో తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. వెంటనే రాతి దీపస్తంభంపైనే దీపం వెలిగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో శనివారం ఆ ఆదేశాలను అమలు చేశారు.
ఈ పరిణామంతో ఎన్నాళ్లుగానో వివాదానికి కారణమైన తిరుప్పరంకుండ్రం రాతి దీపస్తంభంపై మహాదీపం వెలగడం భక్తుల్లో ఆనందాన్ని నింపగా, ఈ ఘట్టం తమిళనాడు వ్యాప్తంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.








