మెదక్–తూప్రాన్ : పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ ఘటన కూల్చారం మండలం పోతన్శెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద చోటుచేసుకుంది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఫంక్షన్ హాల్ వద్ద రాత్రి సమయంలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ బృందం అక్కడ దాడి చేసింది. ఈ సందర్భంగా కూల్చారం గ్రామానికి చెందిన సత్యనారాయణ, శేఖర్, నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,300 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
జూదం కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు: ఎస్పీ
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే దాడులు చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ వెల్లడించారు.








