మెదక్ జిల్లా – తూప్రాన్ : నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా మరింత పటిష్టం చేసే లక్ష్యంతో మెదక్ జిల్లా పోలీసులు తూప్రాన్ పట్టణంలోని 2బీహెచ్‌కే కాలనీలో బుధవారం భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సుమారు 105 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 450కు పైగా ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పత్రాలు సక్రమంగా లేని 61 ద్విచక్ర వాహనాలు, మూడు త్రిచక్ర వాహనాలు కలిపి మొత్తం 64 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిలో నివసిస్తున్న వారి వివరాలను నమోదు చేయడంతో పాటు అనుమానాస్పద కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ డాగ్ “జూబి” సహాయంతో ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికి కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే ఫింగర్‌ప్రింట్ డివైజ్ ద్వారా వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, తూప్రాన్ పట్టణంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తూ తమ తమ ఉపాధి పనుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున వారిని గుర్తించి అరికట్టడమే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ఈ తనిఖీలు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని, వారి భద్రతను మరింత బలోపేతం చేయడానికేనని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. కాలనీల్లో నివసించే వారి పూర్వాపరాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణానికి పోలీసులు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్, నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో పాటు సీసీఎస్, షీ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నారు.








