contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దు : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

రహదారులపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రైతులు, ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

ఎస్పీ మాట్లాడుతూ, కొంతమంది రైతులు పంట కోత అనంతరం వరి ధాన్యాన్ని నేరుగా రహదారులపైనే ఆరబెడుతున్నారని, దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాల ముప్పు పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ధాన్యం చుట్టూ రాళ్లు ఏర్పాటు చేయడం, నల్లటి పాలిథిన్ కవర్లతో కప్పి ఉంచడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు వాటిని సకాలంలో గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఆయన వెల్లడించారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టడం కేవలం ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేశారు.

రైతులు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు లేదా రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రాంతాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను ధాన్యం ఆరబెట్టేందుకు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.

చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్న ఎస్పీ, రైతులు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రమాదాల నివారణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :