మెట్పల్లి – జగిత్యాల జిల్లా : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌పై కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ ఉనికి కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వారు విమర్శించారు.
మంగళవారం మెట్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై మాట్లాడకుండా పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ప్రజల ప్రత్యక్ష తీర్పుతో ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాజకీయ పరిపక్వత కాదన్నారు.
జువ్వాడి కృష్ణారావుకు నామినేటెడ్ పదవి రాకపోవడంతో అసంతృప్తి కారణంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజల విశ్వాసం పొందడంలో విఫలమైన వారు ఇప్పుడు విమర్శల ద్వారా రాజకీయ ప్రాధాన్యం పొందాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా నివాసంలో వ్యక్తిగత పనుల కోసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు తమ సమస్యలు, వైద్య సహాయం తదితర అవసరాలతో క్యాంపు కార్యాలయానికి వస్తుంటారని, వారికి సేవలు అందించేందుకు అవసరమైన సహాయక చర్యలు మాత్రమే చేపడుతున్నామని వివరించారు.
ఎస్‌డీఎఫ్‌సీ, ఈజీఎస్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, కొండ్రికల్ల బ్రిడ్జి నిర్మాణం వంటి అంశాలపై కూడా జువ్వాడి కుటుంబం చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు. తమ సొంత పార్టీ కార్యకర్తలకే పనులు దక్కకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ, ఈ విషయాలపై కాంగ్రెస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన గంగుల భూమయ్య, వర్ధినేని వెంకటేశ్వరరావు, కొమిరెడ్డి జ్యోతక్క, కొమిరెడ్డి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హయాంలో కూడా మున్సిపల్ సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
అలాగే మెట్పల్లి మున్సిపాలిటీ నిధులతో సుమారు రూ.26 లక్షలు ఖర్చు చేసి తమ కుటుంబ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై జువ్వాడి కుటుంబమే ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నందున, వీఎల్టీ అనుమతులపై అనుమానాలు ఉంటే ప్రభుత్వం విచారణ జరిపి అక్రమాలు తేలితే చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
కోరుట్ల నియోజకవర్గంలో విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ఈ విలేకరుల సమావేశంలో పట్టణ మాజీ అధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖరరావు, బంగారు కాళ్ల కిషోర్, పూదారి సుధాకర్ గౌడ్, దీవెనకొండ విష్ణు, భీమనాథ్ సత్యనారాయణ, ఆకుల ప్రవీణ్, జావిద్, రాజశేఖర్, రాజగౌడ్, జోగ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.








