మెట్పల్లి – జగిత్యాల జిల్లా : మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే తన ఇంటి వ్యక్తిగత పనుల కోసం ఇద్దరు మున్సిపల్ కార్మికులను వినియోగించుకుంటున్నారని జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ప్రజల పన్నుల ద్వారా మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లిస్తున్న సమయంలో వారిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హయాంలో కూడా మున్సిపల్ కార్మికులను ఇంటి పనులకు వినియోగిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిని తొలగించారని గుర్తు చేశారు. అప్పట్లో మున్సిపల్ కార్యాలయానికి భారీగా బకాయిలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ప్రభుత్వం జీతం చెల్లిస్తున్నప్పటికీ, మున్సిపల్ కార్మికులకు ప్రజలు చెల్లించే పన్నుల నుంచి వేతనాలు అందుతున్నాయని అన్నారు. అలాంటి కార్మికులను సొంత ఇంటి పనులకు వినియోగించడం ప్రజా ధన దుర్వినియోగమేనని ఆరోపించారు.
ఈ విషయంపై గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కొంతకాలం కార్మికులను తిరిగి మున్సిపల్ పనులకు వినియోగించినా, ప్రస్తుతం మళ్లీ అధికార బలంతో ఇద్దరు కార్మికులను వ్యక్తిగత పనులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
ఇప్పటివరకు ఆ ఇద్దరు మున్సిపల్ కార్మికులకు చెల్లించిన జీతభత్యాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వెంటనే అధికారులకు తిరిగి చెల్లించాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








