మెదక్ – సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన భోజనం, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అలాగే ఎల్నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ప్రత్యేక అధికారి తమకు కేటాయించిన సంక్షేమ వసతి గృహాలను తరచూ సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
ఎల్నీనో ప్రభావం దృష్ట్యా వసతి గృహాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం కోసం బోర్లు అవసరమైన హాస్టళ్లకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పంపించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న ఆమె, అధికారులు క్రమం తప్పకుండా హాస్టళ్లను తనిఖీ చేసి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, బుధవారం నుంచి జిల్లాలో ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులు, నీటి నిర్వహణ, పంటల సంరక్షణపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా విద్యాధికారి రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








