contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

గోదావరిఖని : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రోడ్డు భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణశ్రీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ రక్షణకు రోడ్డు భద్రత అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేపట్టాలని, వీధి వ్యాపారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రహదారులపై పశువులను వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు రోడ్లపై సంచరించే పశువులను గోశాలలకు తరలించాలని ఆదేశించారు.

పట్టణాల్లోని డివైడర్లను పరిశీలించి ప్రమాదాల నివారణకు అవసరమైన మార్పులు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాల్లో యూటర్న్‌లపై సమగ్ర సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రామగుండం నగరంలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గత ఏడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని, పట్టణ ప్రాంతాల్లో రోడ్డు స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల వద్ద తప్పనిసరిగా స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు త్వరగా పంపించాలని పోలీసు అధికారులకు సూచించారు. రహదారుల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు, కార్ల ముందు మరియు వెనుక భాగాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, అతివేగం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, రోడ్డు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డీసీపీ రామ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :