మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం క్రీడా కోటా వంటి ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు.
ప్రతి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న క్రీడను ఎంచుకుని క్రమశిక్షణతో సాధన చేస్తూ, తాను చదువుతున్న పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్రం, దేశంతో పాటు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఆ పోటీల ద్వారా అనేక మంది యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలను కెరీర్‌గా మలుచుకునే యువతకు ఖేలో ఇండియా గొప్ప వేదికగా నిలుస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, స్పోర్ట్స్ ఇన్‌చార్జి ప్రమోద్, సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్, కళాశాల అధ్యాపకులు, చేగుంట మండల బీజేపీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి భూపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుజాత, మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, స్వాతి, సంతోష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రతన్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అత్యుత్సాహంతో తమ ప్రతిభను ప్రదర్శించగా, విజేతలను ఎంపిక చేసి తదుపరి స్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.








