హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసే వారి ఆలోచనల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రధాన రహదారుల పక్కన ఉన్న అపార్ట్‌మెంట్లు, బాల్కనీతో కూడిన ఫ్లాట్లకు అధిక డిమాండ్ ఉండగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వాహనాల రద్దీ, వాయు కాలుష్యం, దుమ్ము, శబ్ద కాలుష్యం వంటి సమస్యలు నగరవాసులను ప్రశాంతమైన ప్రాంతాల వైపు మళ్లిస్తున్నాయి.
ప్రధాన రహదారుల సమీపంలో నివసించే వారు వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము కారణంగా ఆస్తమా, అలర్జీలు వంటి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నిరంతర ట్రాఫిక్ శబ్దం నిద్రలేమి, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడికి దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహిణులు ఇళ్లను ఎంత శుభ్రం చేసినా రోజంతా దుమ్ము పేరుకుపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.
ప్రశాంతమైన ప్రాంతాలకే కొనుగోలుదారుల మొగ్గు
గతంలో ప్రజా రవాణా సౌకర్యం, మంచి అద్దె ఆదాయం కోసం ప్రధాన రహదారుల పక్కన ఇళ్లను ఎంచుకున్న వారు ఇప్పుడు ఆ నిర్ణయంపై పునరాలోచిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం, పాఠశాల బస్సులు ఇంటి వద్దకే రావడం వంటి కారణాలతో రహదారులకు దూరంగా ఉన్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతోంది.
ప్రస్తుతం అనేక నిర్మాణ సంస్థలు ప్రధాన రహదారులకు 500 మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి. పచ్చదనం, ప్రశాంత వాతావరణం, కాలుష్యం తక్కువగా ఉండటం కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న ప్రధాన అంశాలుగా మారాయి.
ఎత్తైన అంతస్తులకు పెరుగుతున్న డిమాండ్
ప్రధాన రహదారుల సమీపంలో ఇల్లు కొనుగోలు చేయాల్సి వచ్చినా, చాలా మంది కొనుగోలుదారులు పై అంతస్తులనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పదో అంతస్తు లేదా అంతకంటే ఎత్తులో ఉంటే ట్రాఫిక్ శబ్దం, వాయు కాలుష్యం ప్రభావం తగ్గడంతో పాటు స్వచ్ఛమైన గాలి, సహజ కాంతి లభిస్తుందని భావిస్తున్నారు.
దీంతో పదో అంతస్తు దాటిన తర్వాత అమలు చేసే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ.20 నుంచి రూ.100 వరకు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా నిర్మాణ సంస్థల మార్పులు
కొనుగోలుదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థలు కూడా తమ ప్రాజెక్టుల రూపకల్పనలో మార్పులు చేస్తున్నాయి. ప్రధాన రహదారికి, నివాస టవర్లకు మధ్య బఫర్ జోన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు దట్టమైన వృక్ష సంపదను పెంచుతున్నారు. రహదారి వైపు వాణిజ్య సముదాయాలు, లోపల నివాస టవర్లు నిర్మించే విధానాన్ని అనుసరిస్తున్నారు.
కొన్ని ప్రాజెక్టుల్లో క్లబ్‌హౌస్‌లు, ఓపెన్ గ్రీన్ స్పేస్‌లు ఏర్పాటు చేస్తుండగా, రహదారి వైపు ఉన్న అపార్ట్‌మెంట్లకు డబుల్ గ్లేజ్డ్ గాజు కిటికీలు అమర్చి బయటి శబ్దాన్ని 70 నుంచి 80 శాతం వరకు తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు.
ప్రశాంతతే ప్రధాన ఆకర్షణ
నరెడ్కో తెలంగాణ మాజీ అధ్యక్షుడు విజయసాయి మేక మాట్లాడుతూ, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉండటం ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమని అన్నారు. రోజంతా ట్రాఫిక్ రద్దీ మధ్య పనిచేసే ప్రజలు ఇంట్లోనైనా ప్రశాంతత కోరుకుంటారని, అందుకే ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే తమ సంస్థ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
ఇల్లు కొనుగోలు చేసే ముందు నిపుణుల సూచనలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రధాన రహదారులకు మరీ దగ్గరగా లేదా మరీ దూరంగా కాకుండా సమతుల్య దూరంలో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రవేశ మార్గాల వెడల్పు, ట్రాఫిక్ పరిస్థితులు, రాత్రి వేళల్లో వాతావరణం ఎలా ఉంటుందో ముందుగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో మారుతున్న ఈ ధోరణి నగరవాసులు ఇప్పుడు కేవలం సౌకర్యాలకే కాకుండా, ఆరోగ్యం, ప్రశాంతత, జీవన నాణ్యతకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.








