గోదావరిఖని : సింగరేణిలో మారుపేర్లకు సంబంధించిన విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు మారుపేర్ల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న తమ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంతో హర్షం వ్యక్తం చేశారు.
గత పదేళ్లుగా సింగరేణిలో మారుపేర్లకు సంబంధించిన విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండటంతో బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను వివరించామని చెప్పారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు వినతిపత్రాలు అందజేసి తమ బాధలను తెలియజేసినట్లు పేర్కొన్నారు.
తమ విజ్ఞప్తులపై స్పందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమస్యను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారని సంఘం సభ్యులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురించాయని వెల్లడించారు.
దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దసరా పండుగ సందర్భంగా శుభవార్త అందడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని హామీ లభించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మారుపేర్ల సంఘం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మారుపేర్ల సంఘం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్‌తో పాటు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








