contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సింగరేణి కార్మికులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : రాజ్ ఠాకూర్ డిమాండ్

గోదావరిఖని : సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆరోపించారు. సింగరేణి కార్మికులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారి సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కేటీఆర్ రామగుండం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సింగరేణి కార్మికుల హక్కులు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్న నాయకులు అధికారంలో ఉన్న సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాజ్ ఠాకూర్ తెలిపారు. కార్మికులకు 34 శాతం లాభాల వాటా అందించడం, మారుపేర్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.

గతంలో డిస్మిస్ అయిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఎవరూ తగిన శ్రద్ధ చూపలేదని, అలాంటి ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, వారి సంక్షేమం, కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ కేసుల పేరుతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం కార్మికుల సమస్యలపై మాట్లాడుతున్న కేటీఆర్ గతంలో వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయారో వివరించాలని డిమాండ్ చేశారు.

రామగుండం అభివృద్ధిని చూసి మాట్లాడాలి

ఇతర ప్రాంతాలైన బెల్లంపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్ నుంచి ప్రజలు రామగుండానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసే అవకాశం కలిగిందని రాజ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. రామగుండం ప్రాంతాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

రామగుండం ప్రజల కష్టార్జిత సొమ్ముతో సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, రామగుండం ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో ఈ ప్రాంత అభివృద్ధికి తగిన ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు.

సింగరేణి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన రాజ్ ఠాకూర్.. కార్మికులకు వాస్తవాలు తెలుసునని, సరైన సమయంలో వారు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని అన్నారు. కార్మికుల త్యాగాలను, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని హితవు పలికారు.

ఉద్యమకారుల త్యాగాలను విస్మరించొద్దు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి గురించి ప్రస్తావించిన రాజ్ ఠాకూర్.. ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ ఓదెల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు కేటీఆర్ హాజరు కాలేదని కూడా విమర్శించారు.

తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను, వారి కుటుంబాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో గత ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కార్మికుల సొంతింటి కల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయిందో ప్రజలకు వివరించాలని కోరారు.

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, కుటుంబాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :