గోదావరిఖని : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, కళాశాల, పాఠశాల సిబ్బందితో కలిసి మనాలి ఠాకూర్ బతుకమ్మ ఆడి సందడి చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో విద్యాసంస్థల ప్రాంగణాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. విద్యార్థులు మన సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకొని, వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.








